hotelshobha.com

Address: # 2-415, N.K Road, Nandyal - 518501, Andhra Pradesh, India Reservation Line: +91 9949132555

Latest News

మహానంది

మహానంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రము మరియు ఒక మండలము. పిన్ కోడ్: 518673. నంద్యాల కు 14 కి.మీ దూరంలో ఉన్న మహాక్షేత్రం మహానంది. ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి. ఇక్కడి మహానందీశ్వర దేవాలయం 7వ శతాబ్ధినాటిది. ఈ ఆలయ శిల్పశైలిని బట్టి ఇది బాదామి చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుని పాలనాకాలం (680-696) నాటిదని అంచనా. ఇచ్చట గల శివలింగము ఎత్తుగా కాక కొంచెము తప్పటగ వుంటుంది. పుట్టలో గల స్వామివారికి ఆవు పాలు ఇస్తుండగా కోపించిన యజమాని ఆవుని కొట్టగా పుట్టలో గల స్వామివారిని ఆవు తొక్కి నందు వలన లింగము కొంచెము అణిగివుంటుంది. ఆవు గిట్ట గుర్తు లింగముపై వుంటుంది. ఇచ్చట శుద్ధ స్ఫటిక వర్ణంలో కనిపించే జలం జలజలా ప్రవహించే దృశ్యం మహానంది ప్రత్యేకత.ఈ పుష్కరిణిలు విశ్వబ్రాహ్మణ శిల్పుల యొక్క పనితనాన్ని తెలియచేస్తుంది.

ప్రధాన ఆలయానికి ఆలయ ముఖ ద్వారం గోపురానికి మధ్యలో ఉన్న పుష్కరిణి లోనికి స్వచ్చమైన నీరు సర్వ వేళలా గోముఖ శిల న్నుండి ధారావాహకంగా వస్తుంటుంది. ప్రధాన ఆలయంలోని లింగం క్రింద భూమిలో ఐదు నీటి ఊటలు ఉన్నాయి. లింగము క్రింద నుండి నీరు ఊరుతూ వుంటుంది. ఆ నీరు పుష్కరిణిలోనే బయటకు కనిపిస్తుంది. అందులోనికి వచ్చిన నీరు గోపురం ముందున్న రెండు గుండాల ద్వార బయటకు పారుతుంది. ఈ నీరు బయటకు ప్రవహించే మార్గల అమరిక వలన పుష్కరిణిలో నీరు ఎల్లప్పుడు ఒకే స్థాయిలో (1.7 మీటర్లు) నిర్మలంగా, పరిశుభ్రంగా ఉంటుంది. ఈ నీరు ఎంత స్వచ్ఛంగా వుంటుందంటే నీటిపై కదలిక లేకుంటే నీరున్నట్టే తెలియదు. ఐదున్నర అడుగులు లోతున్నా క్రిందనున్న రూపాయి బిళ్ల చాల స్పష్టంగా కనబడుతుంది. ఆలయ ఆవరణంలో కొన్ని బావులున్నాయి. అన్నింటిలోను ఇలాంటి నీరే వున్నది. ఈ నీటిని తీర్ధంగా భక్తులు తీసుకెళతారు. ఈ మహనంది క్షేత్రంలో ఊరే నీరు సుమారు 3000 ఏకరాలకు సాగు నీరు అందజేస్తుంది.

ఇచ్చట బ్రహ్మ, విష్ణు, రుద్ర గుండాలు (పుష్కరుణులు) కలవు. మహాశివరాత్రి పుణ్యదినమున లింగోధ్బవసమయమున అభిషేకము, కళ్యాణోత్సవము, రధోత్సవములు జరుగుతాయి. కోదండరామాలయం, కామేశ్వరీదేవి ఆలయం ఇతర దర్శనీయ స్థలాలు. మహానందికి 18 కిలోమీటర్ల పరిధిలో తొమ్మిది నంది ఆలయాలు ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి నవ నందులని పేరు.

ఈ ఆలయంలో మరో ప్రత్యేకత కలదు. అదేమంటే, గర్భాలయానికి ప్రక్కన ఒక శిలా మండపం కలదు. అది నవీన కాలంలో చెక్కిన శిల్పాలు. ఆ శిలా స్థంబాలపై ఆ శిల్పి తల్లి తండ్రుల శిల్పాలు చెక్కి తల్లి దండ్రులపై తనకున్న భక్తిని చాటుకున్నాడు. అదే విధంగా స్థంబాలపై, గాంధీ మహాత్ముని ప్రతిమ, ఇందిరా గాంధి ప్రతిమ, జవహర్ లాల్ నెహ్రూ ప్రతిమలను చెక్కి తనకున్న దేశ భక్తిని చాటుకున్నాడు. ఈ క్షేత్రం 19వ శతాబ్ది తొలిభాగంలో కీకారణ్యంగా ఉండేది. 1830లో ఈ ప్రాంతానికి కాశీయాత్రలో భాగంగా వచ్చిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రాచరిత్రలో భాగంగా ఆ వివరాలు వ్రాశారు. గుడి చుట్టూ సకలఫల వృక్షాలూ ఉండేవనీ, గుడి సమీపంలో ఒక గుడిసె కూడా ఉండేది కాదని ఆయన వ్రాతల వల్ల తెలియవస్తున్నది. అప్పట్లో అన్ని వస్తువులు బసవాపురం నుంచి తెచ్చుకోవాల్సి వచ్చేది. చివరకు నిప్పు దొరకడం కూడా ప్రయాసగానే ఉండేదని ఆయన వ్రాశారు. రాత్రిపూట మనుష్యులు ఉండరనీ తెలిపారు. అర్చకునిగా తమిళుడు ఉండేవారనీ, వచ్చినవారు తామే శివునికి అభిషేకము చేసి పూజించేందుకు అంగీకరించేవారని తెలిపారు. అర్చకుడు ప్రతిదినం ఉదయం తొలి జాముకు వచ్చి ఆలయగర్భగుడి తెరిచేవారు. గోసాయిలు, బైరాగులు రెండు మూడు రోజులు ఆ స్థలంలోనే ఉండి పునశ్చరణ చేసేవారు. మొత్తానికి 1830ల నాటికి ఇది పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధమైనా సౌకర్యాలకు తీవ్రమైన ఇబ్బంది ఉండేది. నంద్యాల నుండి మహానందికి బస్సు సౌకర్యము కలదు. గిద్దలూరు-నంద్యాల మార్గంలో ఉన్న గాజులపల్లె, ఇక్కడికి సమీప రైల్వే స్టేషను.

నవనందులు

కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టు కొలువై ఉన్న నవనందుల దర్శనం జన్న జన్మల నుండి వెంటాడుతున్న పాప గ్రహ దోషాలన్ని పటాపంచలు అవుతాయని పెద్దల నానుడి. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నింటినీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయురారోగ్యాలతో కోరిన కోర్కెలు ఇట్టే తీరుతాయని భక్తుల ప్రధాన విశ్వాసం. 14వ శతాబ్దం నందన మహారాజుల కాలంలో నవనందుల నిర్మాణ జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. వీటిని దర్శించాలంటే నంద్యాల పట్టణంలో శ్యామ్‌ కాల్వ గట్టున ప్రథమనందీశ్వర ఆలయం, ఆర్టీసి బస్టాండ్‌ దగ్గర ఉన్న శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో నాగనందీశ్వరుడు, ఆత్మకూరు బస్టాండ్‌ సమీపంలో సోమనందీశ్వరుడు, బండిఆత్మకూరు మండలం కడమకాల్వ సమీపంలో శివనందీశ్వరుడు, ఇక్కడి నుండి సుమారు 3 కిలో మీటర్ల దూరంలో కృష్ణనంది (విష్ణునంది), నంద్యాల మహానందికి వెళ్ళే దారిలో కుడి వైపుకు తమ్మడపల్లె గ్రామ సమీపంలో సూర్యనందీశ్వర ఆలయం, మహానంది క్షేత్రంలో మహానందీశ్వరుని దర్శనం అనంతరం వినాయక నందీశ్వరుడు, అనంతరం నంది విగ్రహం సమీపంలో గరుడనందీశ్వర ఆలయాలు కొలువై ఉన్నాయి. వీటికి ప్రత్యేకంగా నంద్యాల ఆర్టీసి వారు బస్సులను ఏర్పాటు చేశారు.


One comments on “మహానంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *